
శ్రీ సత్యసాయి జిల్లాలో గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన National Academy of Customs, Indirect Taxes and Narcotics( NACIN ) శిక్షణ కేంద్రం ను ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించనున్నారు. నాసిన్ కేంద్రంలో ప్రధాని మోడీ గంటన్నర పాటు ఉండనున్నారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (IRS) కు ఎంపికైన అభ్యర్థులతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఆరు హెలిప్యాడ్లను అధికారులు ఏర్పాటు చేశారు మరియు ఐదు వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
మోడీ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy), గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. లేపాక్షి నుంచి NACIN కేంద్రానికి చేరుకుంటారు. పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌లోని యాంటీక్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్‌ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్‌ను సందర్శిస్తారు. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎక్స్–రే, బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడనున్నారు. 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తారు.
దేశంలోనే అతిపెద్ద NACIN కేంద్రం
2022లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌కు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చినట్లే ఐఆర్ఎస్‌కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. 503 ఎకరాల విస్తీర్ణంలో…దాదాపు 1500 కోట్ల రూపాయలతో నాసిన్ కేంద్రంలో భవనాలు నిర్మించింది కేంద్రం. ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే నాసిన్ కేంద్రం ఉంది. రెండవ నాసిన్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసింది. ఇది డియాలోనే అతిపెద్ద నాసిన్ కేంద్రం. హర్యానాలో ఉన్న నాసిన్ కేంద్రం కేవలం 23 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. కానీ సత్య సాయి జిల్లాలో ఏర్పాటు చేసిన నాసిన్ కేంద్రం 503 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.