
మెగాస్టార్ చిరంజీవి తన జీవిత చరిత్రను పుస్తకంగా రాసే అవకాశం ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాద్(Yandamoori Veerendranath) కి అప్పగించారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. లోక్ నాయక్ పౌండేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఎన్టీఆర్ 28వ పుణ్యతిది-ఏఎన్నార్ శత జయంతి కార్యక్రమం వైజాగ్ లో జరిగింది. దీనికి మెగాస్టార్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తదితరులతో కలసి యండమూరిని సత్కరించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ యండమూరిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నేను స్టార్ గా ఎదగడానికి యండ మూరి రచనలే కారణం. ఆయన మేథో సంపత్తి నుంచి వచ్చిన పాత్రలే నా కెరీర్ కి సోపానాలయ్యాయి. ఆయన సినిమాలోతనే నాకు మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది. అభిలాష నవల గురించి నాకు మొదట మా అమ్మ చెప్పింది. అదే నవల ఆధారంగా కె.ఎస్ రామారావు గారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీసారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇళయరాజా పాటలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. కెరీర్ లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇక ఛాలెంజ్ ఎంతో మంది యువతని ప్రభావితం చేసింది. నా సినిమా విజయాల్లో సింహభాగం యండమూరి రచనలదే. ఆయన నా జీవిత చరిత్ర రాస్తాను అనడం నిజంగా సంతోషంగా ఉంది అని అన్నారు.
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు తనకు ఎప్పటినుంచో మిత్రులని, అతను తనకి గురు సమానులు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ గురించి కార్యక్రమం చేస్తున్నాను అని నన్ను ఆహ్వానించగానే, రెండో ఆలోచన చేయకుండా వస్తాను అని చెప్పానని అన్నారు చిరంజీవి. NTR, ANR తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు లాంటివారు, వాళ్ళతో కలిసి నేను నటించటం నా అదృష్టంగా భావిస్తాను. ఎన్టీఆర్ తో ‘తిరుగులేని మనిషి’ సినిమా చేస్తున్నప్పుడు నేను స్వయంగా పోరాట సన్నివేశాలు చేస్తుంటే, అది చూసి ఆర్టిస్టు జీవితం చాలా విలువైనది, రిస్క్ చెయ్యకూడదు, ఏదైనా జరిగితే నిర్మాత నష్టపోతాడు అని చెప్పారు. అప్పట్లో అన్నీ నేనే చెయ్యాలని అనుకుడేవాడిని, ఆ తరువాత ‘సంఘర్షణ’ సినిమా టైములో గాయపడి, ఆరు నెలలు సినిమాలకి దూరంగా వున్నాను. పెద్దవాళ్ళు ఇలాంటివి ఊహించి ముందే చెప్తారు అని అప్పుడు అనుకున్నాను,” అని అప్పటి విషయాలను మరొక సారి గుర్తు చేసుకున్నారు చిరంజీవి.
అలాగే ఎన్టీఆర్ విలాసవంతమైన కార్లు, వస్తువులు కొనడం కన్నా ఇళ్ళు, ఇళ్ల స్థలాలు కొనమని సలహా ఇచ్చేవారు. “పారితోషికాలు కాకుండా అలా అప్పుడు కొనుక్కున్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలే ఈరోజు నా కుటుంబాన్ని కాపాడుతున్నాయి,” అని చిరంజీవి చెప్పారు. ఏఎన్నార్ ఎంతో సరదాగా ఉండేవారని, ఆయన తనకున్న బలహీనతల్ని, బలంగా ఎలా మార్చుకున్నారో చెప్పేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు