సిఎం చెపుతున్న 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకం -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu)
జగన్ రెడ్డి ఎన్నికల హామీల మోసాలను ఎండగడుతూ ‘ప్రజాకోర్టు’ పేరుతో ఛార్జ్ షీట్ విడుదల

Jagan Will Remain as a Failure CM
అమరావతి: అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్(Jagan) కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయం అని, అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎం(Failure CM) గా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.
ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్(Jagan) నేడు ప్రజలను నిట్టనిలువునా మోసం చేశాడని దుయ్యబట్టారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘ప్రజాకోర్టు – జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ ఛార్జ్ షీట్’ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…మేనిఫెస్టో, పాదయాత్రలో మొత్తం 730 హామీల్లో 21 శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నాడని అన్నారు. మోస పూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్న జగన్ కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని చంద్రబాబు అన్నారు. ‘‘విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి రూ.64 వేల కోట్ల భారం మోపాడు. మద్య నిషేధం హామీని..అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చాడు.
2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికొదిలేశాడు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపాడు. పెట్రోల్ డీజిల్ ధరలపై మాట తప్పి….జనం జేబులు కొల్లగొడుతున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు హామీపై మాట తప్పాడు. తెలియక హామీ ఇచ్చానంటూ తప్పించుకున్నాడు.
మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీపై మాటే మాట్లాడడం లేదు. జలయజ్ఞం అంటూ ఆర్భాటంగా ప్రకటించి, ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందో తెలీదు. సొంత జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై నాలుక మడతేశాడు. పోలీసులకు వీక్లీ ఆఫ్ హామీ గాలికొదిలేశాడు.ఇలా ఒక్కటని కాదు….తాను ఇచ్చిన ఏ హామీనీ జగన్ అమలు చేయలేదు ?’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఈ సమావేశంలో టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
-By Guduru Ramesh Sr. Journalist