State Board for Wildlife: వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యాత ఇస్తూనే అటవీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ!

State Board for Wildlife: Meeting: అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యాతనివ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ(Konda Surekha) స్పష్టం చేశారు.
Share the news
State Board for Wildlife: వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యాత ఇస్తూనే అటవీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ!

అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, వన్యప్రాణుల సంరక్షణకు అంతే ప్రాధాన్యాతనివ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ(Konda Surekha) స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్(State Board for Wildlife) ఛైర్మన్ శ్రీమతి కొండా సురేఖ అధ్యక్షతన ఏడవ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్(State Board for Wildlife) సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, పిసిసిఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎం సి పర్గెయిన్, ఫీల్డ్ డైరక్టర్ లు క్షితిజ, శాంతారాం, బోర్డు అధికారులు, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆర్ అండ్ బి, పంచాయతీ, పశుసంవర్ధక శాఖ అధికారులు, బిసిఎన్ఎల్, టి ఫైబర్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

State Board for Wildlife సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు:

మారుమూల ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు వచ్చిన 19 ప్రతిపాదనలను స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఆమోదించింది. కోర్ ఏరియా పరిధిలోకి వచ్చే ఐదు ప్రతిపాదనలను బోర్డ్ ఆమోదించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలతో పాటు అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆవాసాలకు టి ఫైబర్ కనెక్టివిటిని కల్పించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

See also  Telangana at Davos: తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయనున్న JSW Neo Energy

కవ్వాల్ టైగర్ రిజర్వ్ కు కొనసాగింపుగా కన్సర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు ప్రతిపాదనకు స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్(State Board for Wildlife:) ఆమోదం తెలిపింది. త్వరలోనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. దీని ద్వారా కవ్వాల్ టైగర్ రిజర్వ్ తాడోబా టైగర్ రిజర్వ్ మధ్య కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటవుతుంది. పులుల స్వేచ్ఛగా సంచరించేందుకు కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలో మొత్తం 1492 చ.కి.మీ ల పరిధిలో కన్జర్వేషన్ రిజర్వ్ రూపుదిద్దుకోనున్నది.

వన్య ప్రాణుల దాడుల్లో చనిపోయిన వారికిచ్చే నష్టపరిహారాన్ని 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తీసుకున్న నిర్ణయాన్ని వైల్డ్ లైఫ్ బోర్డ్ ఆమోదించింది.

పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి ప్రైవేట్ యాజమాన్యంలోని ఏనుగులను మతపరమైన ఊరేగింపులు, ఇతర సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకురావడానికి ఎన్ఓసి జారీ చేయాలని అభ్యర్థిస్తూ అటవీ శాఖలో అనేక దరఖాస్తులు వచ్చాయి. గత 3 సంవత్సరాలలో 50 దరఖాస్తులకు ఆమోదం లభించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రత్యేక సందర్భాల్లో ఏనుగుల వినియోగం పై త్వరలో విధివిధానాలను రూపొందించాలని మంత్రి ఆదేశించారు.

పాము కాటు వల్ల జరిగే మరణాలకు నష్ట పరిహారాన్ని వర్తింప చేయాలన్న ప్రతిపాదనల పై సమావేశంలో చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

See also  EAPCET Preliminary Key: తెలంగాణ ఈఏపీసీఈటీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ విడుదల!

రక్షిత అటవీ ప్రాంతాల గుండా వెళ్ళే కొత్త రాష్ట్ర, జాతీయ రహదారుల్లో యానిమల్ ప్యాసెజ్ ల నిర్మాణం పై చర్చ జరిగింది. ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖలు ఈ ప్యాసేజ్ ల ఎత్తును తగ్గించాలని సూచించగా, సాధ్యాసాధ్యాలను వీలైనంత త్వరగా అధ్యయనం చేసి కేంద్ర అనుమతులు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అధికారులు, అటవీ నిపుణులు సమన్వయంతో వ్యవహరించి ఎన్ని ప్యాసేజ్ లు ఏర్పాటు చేయాలో నిర్ణయించాలని సూచించారు.

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని మంత్రి సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి ఎకో టూరిజం పాలసీని రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

సత్తుపల్లి, కిన్నెరసాని ప్రాంతాల్లో అడవి దున్నల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రత్యేక శాంక్చురీ ఏర్పాటు ప్రతిపాదనల పై చర్చ జరగింది. ప్రత్యేక శాంక్చురీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు.

కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ల నిర్వహణ పై ఫీల్డ్ డైరక్టర్ లు ఇద్దరు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో గ్రామాల తరలింపు పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోనూ గ్రామాల తరలింపు ప్రక్రియ పై అధ్యయనం చేయాలని సూచించారు.

See also  New High Court in Telangana: 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

టైగర్ ట్రాకర్స్ తో పాటు అటవీ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.

వేసవిలో అటవీ ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. టైగర్ రిజర్వుల్లో అగ్ని ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావాలని, ఆ దిశగా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అటవీ సమీప గ్రామాల ప్రజలను అగ్ని ప్రమాదాల నివారణ దిశగా చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్(State Board for Wildlife) ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ విధులు, అధికారాలు; వన్యప్రాణుల రక్షిత ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టేందుకు చర్యలు, రక్షిత ప్రాంతాల్లో 4 జి మొబైల్ టవర్ల నిర్మాణం, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ళ ఏర్పాటు, రోడ్ల నిర్మాణం; టైగర్ రిజర్వ్‌లు, ఇతర రక్షిత ప్రాంతాలలో కమ్యూనిటీ ఆధారిత పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం తదితర అంశాల పై బోర్డు చర్చించింది.

అటవీ శాఖలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాల చెల్లింపు, కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు, వన్యప్రాణుల దాడులలో పరిహారం పెంపు పట్ల మంత్రి చూపిన చొరవకు బోర్డు సభ్యులందరు మంత్రిని హృదయపూర్వకంగా అభినందించారు.

Also Read News

Scroll to Top