Maghamasam: మాఘమాసం ఎప్పుడొస్తుందో?.. వచ్చేసింది.. మాఘమాసం విశిష్టత తెలుసుకుందామా!

Share the news
Maghamasam: మాఘమాసం ఎప్పుడొస్తుందో?.. వచ్చేసింది.. మాఘమాసం విశిష్టత తెలుసుకుందామా!

మాఘమాసం(Maghamasam) విశిష్టత

మాఘమాసము(Maghamasam)లో నదీస్నానమాచరించిన యెడల అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక, మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలోస్నానముచేసి, శ్రీమన్నారాయణుని పూజించి, సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి, విష్ణువు మందిరమునగాని, శివాలయమున గాని దీపము వెలిగించి, ప్రసాదము సేవించిన యెడల తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక, పునర్జన్మ యెన్నటికిని కలుగదు అని మాఘ పురాణం చెబుతుంది.

మాఘ మాస స్నాన విశిష్టత:

శ్లోll దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చ l
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం ll
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ l
స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవ ll
ఈ పైన చెప్పిన శ్లోకం చదువుతూ మాఘ స్నానం చేయాలి. మాఘమాసం(Maghamasam)లో సూర్యోదయానికి ముందే చేసే స్నానం పుష్కర స్నాన ఫలాన్ని ఇస్తుంధి.

మాఘ మాసం(Maghamasam)లో వచ్చే పండుగల విశిష్టత:

శ్రీ పంచమి(Sri Panchami):

    మాఘమాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథి వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. వసంత పంచమి అంటే సరస్వతి దేవి జన్మదినం.

    See also  AP 10th Class Results 2024: ఏపీ టెన్త్ రిజల్ట్స్ విడుదల.. వెబ్ సైట్ లో ఇలా చెక్ చేసుకోండి..

    రథ సప్తమి(Ratha Saptami):

    Ratha Saptami

    మాఘమాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అనగా సూర్యుడి జన్మదినంగా జరుపుకుంటారు. సూర్యుని గమనం ఏడు గుర్రములు ( 7 ఆశ్వాల పేర్లు: గాయత్రి, త్రిష్ణుప్పు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు) పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము తెలుపుతుంది.

    శ్లోll యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు l
         తన్మే రోగఞ్చ శోకంచ మాకరీ హంతు సప్తమి ll

    రథసప్తమి రోజు ఏడు జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము.

    రథసప్తమి నాడు ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండాలి. దానిని 27 చిక్కుడు ఆకులలో ( 27 చిక్కుడు ఆకులు అనగా 12 ఆకులలో సూర్యదేవునికి, 5ఆకులలో అగ్నిదేవునికి, 5 ఆకులలో తులసిమాతకు, 1 ఆకులో యముడికి, 1 ఆకులో చిత్రగుప్తునికి, 3 ఆకులలో మోహినికి) ఉంచి సూర్య భగవానునికి నైవేద్యం పెట్టాలి.

    భీష్మాష్టమి(Bhishmashtami):

    మాఘమాసం శుక్ల పక్షంలో వచ్చే అష్టమి తిథిని భీష్మాష్టమి అంటారు. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. అలా 58 రోజులు ఉండి అష్టమి నాడు పరమపదించారు కావున ఈ రోజును భీష్మాష్టమి అని అంటారు. భీష్మాష్టమి రోజున భీష్మునికి తర్పణం విడవాలని పద్మ పురాణం తెలుపుతున్నది. ఈ రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

    See also  TS SSC 2024 Hall Tickets: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి ఇలా!
    Bhishmashtami

    భీష్మ ఏకాదశి(Bhishma Ekadashi):

    భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని “భీష్మ ఏకాదశి” అని అంటారు. గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై ఎనిమిది మంది వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె ఏడుగురిని  తనలోకి తీసేసుకున్నది. వారిలో ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అలా శంతనుడి చేత శాపవిముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడయినాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాదికాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది.

    భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి భీష్ముడు అంపశయ్యపై ఉన్న సమయంలో తనను చూడటానికి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడిని చూసిన అమితానందంతో సహస్ర నామాలతో కీర్తిస్తాడు. ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణుసహస్రనామం పఠిస్తే అనుకున్న కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి.

    See also  Group-2 and SBI Clerk Exams issue: ఒకేరోజు గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలు.. సమస్యను పరిష్కరించిన SBI..

    మహాశివరాత్రి(Mahashivratri):

    Mahashivratri

     మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు.  శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. మహా శివరాత్రి రోజున, నిషితా కాలం శివ పూజ అనుసరించుటకు అనువైన సమయం. శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించింది, నిషితా కాలం జరుపుకుంటారు. ఈ రోజున, అన్ని శివాలయాలు లో, అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు.

    అందరు తెల్లవారు ఝామునలేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేయాలి . రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . 

    మాఘ మాసం(Maghamasam)లో ముప్పై రోజులు శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తి, పుత్ర పౌత్రాభివృద్ధి మరియు వైకుంట ప్రాప్తి పొందగలరు.

    వ్యాస కర్త:

    పంతులుగారు భీష్మ కుమార్ శర్మ
    9030243911

    Leave a Comment

    Your email address will not be published. Required fields are marked *

    Scroll to Top