
Harirama Jogaiah bitter Letter To Pawan Kalyan
టీడీపీ, జనసేన సీట్ల పంపకంపై కాపు సంక్షేమ నేత చేగొండి హరిరామ జోగయ్య(Harirama Jogaiah) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌కు సంచలన లేఖ రాశారు. “పంపకం జరిగిన 118 సీట్లలో కమ్మవారికి 24 సీట్లు, రెడ్లకు 17 సీట్లు, కావులకు 15 సీట్లు, బి.సి.లకు 25 సీట్లు ఇచ్చారన్న హరిరామ జోగయ్య.. ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయంగా బి.సి.లకు 50 శాతం, కావులకు 25 శాతం, కమ్మ సామాజికవర్గానికి 4 శాతం, రెడ్లకు 6 శాతం సీట్లు దక్కాల్సి ఉంటుందన్నారు. సామాజిక న్యాయం అనుసరిస్తూ అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరిగిందా అని ప్రశ్నించారు. అలాగే సీట్ల పంపకంలో జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు జన సైనికుల సంతృప్తి మీద జరిగాయా” అంటూ హరిరామ జోగయ్య (Harirama Jogaiah)లేఖలో ప్రస్తావించారు.
“జనసేనపార్టీకి 24 సీట్లకు మించి నెగ్గగల స్తోమత లేదా? జనసేన పరిస్థితి ప్రజలలో అంత హీనంగా ఉందా? ఈపంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా? జనసేనకు 50 నుంచి 60 సీట్లు దక్కాల్సిందన్న హరిరామ జోగయ్య.. ఆ మేరకు ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలను కూడా గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఆయా నియోజకవర్గాలలో వివిధ కులాలకు సంబంధించి బలమైన అభ్యర్థుల పేర్లను కూడ ప్రకటించటం జరిగిందని” ఆయన లేఖలో అన్నారు.
“జనసేన శక్తిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారో? ఏది ఏమైనా ఈ 24 నియోజకవర్గాలు కేటాయింపు అధిక సంఖ్యాకులైన జనసైనికులను సంతృప్తిపరచని మాట వాస్తవం. వారు కోరుకుంటున్నది రాజ్యాధికారంలో తమకు గౌరవమైన వాటా, అదీ సీట్ల పంపకంలో. జరిగినప్పుడే పరిపాలనాధికారం కూడ దక్కుతుందనేది వారి వాదన” అని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.
“జన సైనికులకు కావల్సింది కేవలం ఎన్ని ఎమ్.ఎల్.ఏ పదవులు దక్కించుకొన్నామని కాదు, పవన్ కళ్యాణ్ పరిపాలనాధికారం చేబట్టటమని హరిరామ జోగయ్య అన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్‌కు రెండున్నర ఏళ్లు ముఖ్యమంత్రి పదవి దక్కాలి. చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. ఈ పదవులు అన్నీ చెరిసగం పంచుకుంటామని చంద్రబాబు స్వయంగా ప్రకటించాలని” హరిరామ జోగయ్య(Harirama Jogaiah) డిమాండ్ చేశారు. ఈ రకమైన ప్రకటన విడుదల అయితే జన సైనికులందరూ సంతృప్తి పడే అవకాశం ఉంది. ఈ సంక్షోభానికి ఇదే మాత్ర అని లేఖలో ఆయన పేర్కొన్నారు.