
LRS దరఖాస్తు దారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్!
ఎల్ఆర్ఎస్(LRS) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 లో స్వీకరించిన Land Regularization Scheme(LRS) దరఖాస్తులను మార్చి 31లోపు క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. లేఔట్లు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పించింది. దాంతో దాదాపు 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. దేవాయల, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప, ఇతర భూముల రెగ్యులరైజేషన్ కు అడ్డంకులు తొలగినట్లయింది. లేఔట్ల భూములను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. తరువాత దాని అతి గతి పట్టించుకొన్న వారే లేరు. ఈలోపు బీఆర్ఎస్ పార్టీ అధికారం కూడా కోల్పోవడం జరిగింది.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన LRS వల్ల స్థానిక సంస్థలకు మంచి ఆదాయం సమకూరింది. అనుమతి లేకుండా వేసిన లే అవుట్లలో కొనుగోలు చేసిన వారికి క్రమబద్దీకరించుకునేందుకు సర్కార్ మరోసారి అవకాశం కల్పించింది. అనధికార లే ఔట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇటు ఇళ్లు నిర్మాణానికి అనుమతులు రాక, అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది. ఆ క్రమంలో అనుమతి లేని లే ఔట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ స్కీం తీసుకొచ్చింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ధరఖాస్తులు వచ్చాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 31లోగా క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది.
ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, చెరువు శిఖం భూములలో ఉన్న లే అవుట్లకు క్రమబద్ధీకరించుకునే అనుమతి ఇవ్వకూడదని, వాటిని స్కీంలో నుంచి తొలగించారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సైతం ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణకు అనుమతించలేదు. కేవలం అనుమతి లేని లే ఔట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ద్వారా రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.