
Half Day Schools In Telangana
రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటి పూట(Half Day Schools) బడులను పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ పాఠశాలలు అన్ని విద్యా సంవత్సరం చివరి పనిదినం వరకు ఒంటి పూట పని చేస్తాయి. విద్యా సంవత్సరం చివరి పనిదినం ఏప్రిల్ 23, 2024.
హాఫ్‌డే స్కూల్స్ లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్లాస్‌వర్క్ అనంతరం మధ్యాహ్న భోజనం అందజేయనున్నారు. ఇక తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. SSC పబ్లిక్ పరీక్షా కేంద్రాలుగా నియమించబడిన పాఠశాలల్లో, మధ్యాహ్న భోజనం ముందుగా అందించబడుతుంది, తరువాత మధ్యాహ్నం తరగతులు ఉంటాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను 10వ తరగతి(10th Class) పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం తరగతులు నిర్వహిస్తారు. పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే వారికి భోజనం తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహించబడతాయి. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత..యథావిథిగా ఉదయం పూట తరగతులు నిర్వహించనున్నారని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.