
Jagan and YCP strategy behind Visakha Vision
ముందుగా సీఎం జగన్ ఈ టర్మ్ లో విశాఖను ఏ విదంగా అభివృద్ధి చేసారో చూద్దాం. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ అంటున్న ఆయన మాటల వెనుక మతలబు ఏవిటో తరువాత చూద్దాం. మూడు రాజధానులు ప్రకటించి మూడేళ్లు దాటిపోయింది. ఈ టర్మ్ లోనే పరిపాలన రాజధానిగా విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టడానికి ఆయనకు ఏం అడ్డొచ్చింది? ఎందుకు మొదలు పెట్టలేక పోయారు? ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా ఎందుకు ఆపలేదు? ఆంధ్రుల హక్కు వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర ఎందుకు వహించడం? అప్పుడు ఆయన విశాఖ విజన్ ఏమైంది. ఇప్పటికి రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం ఆయనకు వున్న విశాఖ విజన్ ను తెలుపుతుంది. రిషికొండను బోడి గుండు లా చేసి రిసార్టు కట్టడమా విశాఖ విజన్ అంటే. విశాఖ మెట్రో సంగతి ఏమైందో? భోగాపురం ఎయిర్ పోర్టు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఇవి జస్ట్ కొన్ని మాత్రమే.
ఇక పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మభ్య పెట్టారు. ఇప్పుడు ఎన్నికల ముందు, నెక్స్ట్ టర్మ్ లో విశాఖే రాజధాని అని 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకానికి ఎందుకు తెర తీస్తున్నారు? ఎందుకు అంటే ప్రస్తుత సర్వేలన్ని వైజాగ్ నుంచి నెల్లూరు వరకు కనీసం 20 సీట్లను కూడా దాటలేని పరిస్థితిలో వైసీపీ ఉందంటున్నాయి. రాయలసీమలో మాత్రం బిక్కుబిక్కుమంటూ 20 సీట్లు పైగా రావచ్చు. ఈ మధ్య వస్తున్న సర్వే ఫలితాలన్నీ ఇలానే ఉంటున్నాయి. ఇక సెంట్రల్ ఆంధ్ర జిల్లాలు ఐన గోదావరి, కృష్ణ, గుంటూరు పై వైసీపీకి పెద్దగా ఆశలు ఏమి లేవు. దాంతో ఉత్తరాంధ్ర లో, వైజాగ్ తో సహా 25 సీట్లు అయినా తెచ్చుకోగలిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పరిస్థితి మెరుగవుతుందని వైసీపీ భావిస్తున్నట్లుగా తోస్తుంది. ఇక వైజాగ్ రాజధాని అంటే సరిహద్దుల్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని నియోజకవర్గాలను కూడా ఆకర్షించవచ్చని ఆలోచిస్తున్నారులా వుంది. ఇదే వ్యూహంతో దింపుడు కళ్లెం ఆశతో జగన్ వైజాగ్ ని ఏకైక రాజధాని ప్రకటించటం జరిగిందని రాజకీయ విశ్లేషకుల భావన.
మరి ఈ Visakha vision ఎత్తుగడ పని చేస్తుందా అంటే చేయకపోవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు త్వరగా నమ్ముతారు. కష్టజీవులు, అమాయకులు. అయితే ఒకసారి జగన్ పరిపాలన చూసిన తరువాత రెండో సారి కూడా ఆయన్ను నమ్మేటంత అమాయుకులు అయితే కాదు ఉత్తరాంధ్ర జనం. చూద్దాం ఇంకా కొన్ని రోజులేగా, ఏమవుతుందో.
: