
Ayodhya SriRama Mandir, కోట్లాది మంది హిందువులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. అయోధ్య లో దివ్యమైన రామ మందిర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరి 22 న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ మహాక్రతువునకు బ్రహ్మాండంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు త్వరిత గతిన జరుగుతున్నాయి. ఆలయ దర్శనానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివచ్చే అవకాశం ఉంది.
Ayodhya SriRama Mandir: మొదటి 100 రోజుల్లో 1000 రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది!
ఈ నేపథ్యంలో అయోధ్యకు మొదటి 100 రోజుల్లో 1000 రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ప్రతిష్ఠ జరిగిన మర్నాడు నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలు ఇంకా పుణే, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ సహా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లను నడపనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదిత రైళ్ల సంఖ్యను అమలు చేయవచ్చు.. అయోధ్యలోని స్టేషన్ కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులకు అనుగుణంగా పునరుద్ధరించారు’ అని పేర్కొన్నారు. రోజుకు దాదాపు 50,000 మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది జనవరి 15 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని చెప్పాయి.