
భూ వివాదం కేసులో అరెస్ట్ అయిన Kalvakuntla Kanna Rao
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కల్వకుంట్ల కన్నారావు(Kalvakuntla Kanna Rao)ను ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. భూకబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలంటూ అయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజకీయ కక్షలతో చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్న పిటిషనర్ వాదనను కోర్టు తిరస్కరించింది. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
మన్నెగూడ వద్ద రెండెకరాల భూమిని కన్నారావు మరో 30 మందితో కలిసి కబ్జాకు యత్నించా రంటూ ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్(OSR Projects) డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో ఆదిభట్ల పీఎస్ పరిధిలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టు ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్నొన్నారు. కన్నారావుతో పాటు మరో 38 మంది బీఆర్ఎస్(BRS) నేతల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద కేసు నమోదు చేశారు. ఫెన్సింగ్ రాళ్లను తొలగించి, హద్దు రాళ్లను పెట్టినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇకపోతే 38 మందిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 35 మంది పరారీలో ఉన్నారు.