
అత్యంత శక్తివంతమైన MRI Scanner !
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన.. ఫ్రాన్స్‌కు(France) చెందిన ఎంఆర్ఐ స్కానర్(MRI Scanner) మానవ మెదడుకు సంబంధించిన మొదటి ఫోటోలను అందించింది. ఇది మానవుడి మెదడులోని రహస్యాలను, పలు అనారోగ్యాలను మరింత ఖచ్చితత్వంతో కనుగొనేందుకు ఉపయోగపడుతుంది.
ఫ్రాన్స్‌కు చెందిన అటామిక్ ఎనర్జీ కమిషన్(CEA) పరిశోధకులు మొదటిసారిగా 2021లో గుమ్మడికాయను స్కాన్ చేయడానికి ఈ స్కానర్ ని ఉపయోగించారు. ఫ్రెంచ్, జర్మన్ ఇంజనీర్ల భాగస్వామ్యంతో రెండు దశాబ్దాల పరిశోధన ఫలితంగా ఈ స్కానర్ రూపొందించబడింది. యూఎస్, దక్షిణ కొరియా కూడా ఇలాంటి శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్లపై పనిచేస్తున్నాయి.., కానీ ఇంకా మనుషుల చిత్రాలను స్కాన్ చేయడం ప్రారంభించలేదు.

ఇటీవలే అధికారులు మానవుల మెదడును స్కాన్ చేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన అటామిక్ ఎనర్జీ కమిషన్(CEA) పరిశోధకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా దాదాపు 20 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లు మొదటిసారి ఈ ఎంఆర్ఐ మెషిన్(MRI Scanner) ద్వారా స్కాన్ చేయించుకున్నారు
ఈ స్కానర్ 11.7 టెస్లాస్ మాగ్నటిక్ ఫీల్డ్‌ను సృష్టించింది (సాధారణ ఎంఆర్ఐ స్కానర్ ల మాగ్నటిక్ ఫీల్డ్ 3 టెస్లాలకు మించి ఉండదు). ఇది ఆసుపత్రులలో సాధారణంగా ఉపయోగించే ఎంఆర్ఐ స్కానర్ల కంటే 10 రెట్లు ఎక్కువ ఖచ్చితమైన ఫోటోలను స్కాన్ చేసి అందించిందని ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న భౌతిక శాస్త్రవేత్త అలెగ్జాండర్ విగ్నాడ్ (Alexandre Vignaud) అన్నారు. ఈ స్కానర్ ద్వారా మెదడుకు ఆహారం అందించే చిన్న నాళాలు, ఇప్పటి వరకు దాదాపు కనిపించని చిన్న మెదడు (Cerebellum) వివరాలను మనం చూడవచ్చని ఆయన తెలిపారు.
పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యాల గురించి మెరుగైన ఫలితాలను ఈ స్కానర్ ఇస్తుందని, బైపోలార్ డిజార్డర్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే లిథియం వంటి కొన్ని మందులు మెదడు ద్వారా ఎలా సరఫరా చేయబడతాయో తెలుసుకోవచ్చని, ఏ రోగులు ఔషధానికి మెరుగ్గా లేదా అధ్వాన్నంగా స్పందిస్తారో గుర్తించడంలో ఇది సహాయపడుతుందని, CEA పరిశోధకుడు అన్నె-ఇసాబెల్ ఎటిన్‌వ్రే (Anne-Isabelle Etienvre) పేర్కొన్నారు.
-By VVA Prasad