
తైపీ 101ని కాపాడిన Tuned Mass Damper
ఏప్రిల్ 3న తైవాన్(Taiwan)లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం(Earthquake) దాదాపు 770 భవనాలను నేలమట్టం చేసింది. గత 25 ఏళ్లలో తైవాన్‌లో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే. ఈ భూకంప కేంద్రం తైవాన్ రాజధాని తైపీ(Taipei) కి కేవలం 80 మైళ్ల దూరంలో ఉంది. ఈ సంఘటనలో తొమ్మిది మంది ప్రజలు కూడా చనిపోయారు. ఇంత భయంకరమైన భూకంపం వచ్చినప్పటికీ, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తైపీలోని 1667 అడుగుల ఎత్తైన Taipei 101 అంతస్తుల భవనానికి ఎటువంటి నష్టం జరగలేదు.
దీనికి గల ముఖ్య కారణం.. ఈ భవనంలో అమర్చిన 660 టన్నులు, 18 అడుగుల వ్యాసం గల, పెద్ద వృత్తాకార ఉక్కు గోళం. దీనిని ట్యూన్డ్ మాస్ డంపర్(Tuned Mass Damper) అని పిలుస్తారు. దీనిని భవనంలోని 87 నుంచి 92వ అంతస్తుల మధ్య మందపాటి కేబుళ్ల సహాయంతో అమర్చారు. ఈ పరికరం భూకంపాల నుంచి రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ 660 టన్నుల గోళం భవనం కూలిపోకుండా ఎలా నిరోధిస్తుంది?
ఈ ఉక్కు గోళం… ఏ దిశలోనైనా 5 అడుగుల వరకు కదలగలదు. దీని వల్ల భూకంప సమయంలో భవనం ఒక దిశలో వంగినప్పుడు, ఈ గోళం వ్యతిరేక దిశలో వంగి భవన సమతుల్యతను కాపాడుతుంది. ఈ విధంగా వ్యతిరేక దిశలో కదలడం వలన అది మొత్తం గతి శక్తిని గ్రహించి.. ఈ గతి శక్తిని వేడిగా మార్చి బయటకు పంపిస్తుంది. దీని వలన భవనానికి ఎటువంటి నష్టం జరగదు.
ఈ వినూత్న రూపకల్పన కారణంగానే ఆ ఆకాశహర్మ్యం అంత తీవ్రమైన భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడిందని చెబుతున్నారు. ఈ విధమైన ట్యూన్డ్ మాస్ డంపర్(Tuned Mass Damper) ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఎత్తైన భవనాల్లో అమర్చుతున్నారు. ప్రస్తుతం ఇది పర్యాటకులకు ఆకర్షణీయంగా కూడా మారుతోంది. ముఖ్యంగా బలమైన గాలుల సమయంలో ఇది అటూ.. ఇటూ లోలకం వలె కదులుతుంది.
-By VVA Prasad