![IND VS SA 3rd ODI: కుమ్మేసిన కుర్రోళ్ళు.. టీమిండియాదే ODI సిరీస్](https://samacharnow.in/wp-content/uploads/2023/12/IND-VS-SA-3rd-ODI.webp)
IND VS SA 3rd ODI
ఆఖరి వన్డేలో సఫారీలు చిత్తు
2-1తో టీమిండియాదే సిరీస్
తన కెరీర్‌లో తొలి శతకం సాధించిన శాంసన్
అర్ష్‌దీప్ సింగ్‌కు నాలుగు వికెట్లు
జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న సంజూ శాంసన్ (114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 108) ఎట్టకేలకు తన సత్తా చాటుకున్నాడు. అటు పేసర్లు, స్పిన్నర్లు కూడా వికెట్లు తీయడంతో గురువారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 78 రన్స్‌తో ఘనవిజయం సాధించింది. దానితో మూడు వన్డేల సిరీస్ ను 2-1తో నెగ్గింది. సౌతాఫ్రికాలో భారత్‌కిది రెండో సిరీస్ విజయం మాత్రమే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి 30 ఓవర్లలో నెమ్మదిగా ఆడిన తీరుకు కనీసం 250 పరుగులైనా సాధించగలదా? అనిపించింది. కానీ శాంసన్, తిలక్ నిలకడైన భాగస్వామ్యానికి ఫినిషర్ రింకూ సింగ్ తోడవడంతో లాస్ట్ 14 ఓవర్లలో 141 పరుగులు సాధించగలిగింది. Debut ఓపెనర్ రజత్ పటీదార్ (22) కాసేపు అదరగొట్టాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (10) ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. కెప్టెన్ రాహుల్ (21) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అప్పటికి టీమిండియా స్కోరు 102/3 మాత్రమే. మిడిల్ ఓవర్ల లో కూడా సఫారీ పేసర్లు ప్రభావం చూపడంతో పరుగులు రావడం మరింత కష్టమైంది. కుదురుకునే వరకు మెల్లగా ఆడిన తిలక్, తరువాత శాంసన్‌తో కలిసి సహజశైలిలో బ్యాట్లు ఝుళిపించారు. ఇద్దరూ కలసి పోటా పోటీగా Fours బాదేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే తొలి అర్ధసెంచరీ సాధించిన వెంటనే తిలక్ అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తరువాత శాంసన్ 110 బంతుల్లో కెరీర్‌లో మొదటి శతకం పూర్తి చేసుకుని అవుటయ్యాడు. చివర్లో వేగంగా వికెట్లు కోల్పోయినా రింకూ సింగ్ ఆటతీరుతో జట్టు 296/8 చేయగలిగింది.
భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. ఓపెనర్ జోర్జి, కెప్టెన్ మార్‌క్రమ్ క్రీజులో ఉన్నంత సేపు ఆతిథ్య జట్టు ఛేదన వైపు సాగుతున్నట్టే కనిపించింది. కానీ పేస్, స్పిన్ బంతులకు మధ్య ఓవర్లలో ఆతిథ్య జట్టు బ్యాటర్లు బ్యాట్లెత్తేశారు. ప్రారంభంలో మరో ఓపెనర్ రీజా హెన్‌డ్రిక్స్ (19)తో జోర్జి First వికెట్‌కు 59 పరుగులు అందించాడు. డుస్సెన్ (2) అవుటయ్యాక జోర్జికి మార్‌క్రమ్ తోడయ్యాడు. దీంతో ఈ జోడీ అడపాదడపా బౌండరీలు కొడుతూ జోరు ప్రదర్శించింది. 26వ ఓవర్‌లో సుందర్ బంతిని స్వీప్‌షాట్ ఆడేందుకు చూసిన మార్‌క్రమ్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌కు 65 రన్స్ భాగస్వామ్యానికి తెరపడటం తో పాటు జట్టు లయ దెబ్బతింది. శతకం ఖాయమనుకున్న జోర్జి కాసేపటికే అవుటవడంతో మిగిలిన వికెట్లు కూడా టపటపా నేలకూలాయి.