
NEET-PG వాయిదా!
సంవత్సరాల తరబడి తాగే సాగే చదువులు, శిక్షణలు (కోచింగులు) లక్షలాది రూపాయల ఖర్చులతో విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతుంటే.. వాటిని నిర్వహించవలసిన యంత్రాంగాలు మాత్రం స్టీరింగ్ పట్టుకోవడం రాని వాడికి హైవే పై హెవీ వెహికల్ డ్రైవింగ్ అప్పచెప్పినట్లుగా.. పిల్లల భవిష్యత్తును వారి కలలను, వారి ప్రాణాలను నట్టేట ముంచుతున్నారు.
వంట చేసేముందు ఇల్లాలి కి ఒక ప్రణాళిక ఉంటుంది. పొలంలోకి దిగేముందు రైతుకు ప్రణాళిక ఉంటుంది. గోడ కట్టే ముందు టాపీ పనివానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ మాత్రం ప్రణాళికలు లేని అసమర్ధ, అనైతిక అధికారుల చేతిలో, నీతి నిజాయితీ లేని రాజకీయ నాయకుల చేతుల్లో పడి ఈ పరీక్షా విధానం నిర్వీర్యమై నవ్వుల పాలవుతోంది.
ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన పరీక్ష నీట్ (NEET). అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల్లో ఎం.బి.బి.ఎస్ , ఎం.డి, ఎం.ఎస్ వంటి అత్యున్నత కోర్సులకు జరిగే ఈ పరీక్షల ద్వారా మాత్రమే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యాన్నందించే వైద్యులు బయటకు వస్తారు. కానీ ఈ పరీక్షా విధానం మాత్రం కాబోయే వైద్యులని ముందుగానే రోగులుగా మార్చి వేస్తున్నాయి.
పరీక్ష హాల్లోకి వెళ్లే విద్యార్థులను అంతర్జాతీయ ఉగ్రవాదుల కన్నా తీవ్రంగా పరీక్షించే ఈ యంత్రాంగం ముందు తనను తాను పరీక్షించుకోవడం మర్చిపోతుంది.
ఈ రోజు జూన్ 23 ఆదివారం జరగవలసిన నీట్ పీజీ ఎగ్జామ్ కు రాసే విద్యార్థులందరికీ రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంటర్స్ ఇచ్చారు. ప్రశాంతంగా పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు ఒకరోజు ముందే అంతంత దూర ప్రయాణాలు చేసి శారీరకంగా మానసికంగా ఎంతో అలసిపోతారు.
ఉదయం ఏడు గంటలకే పరీక్షా కేంద్రాల్లో రిపోర్ట్ చేయవలసిరావడం వల్ల అంత ఉదయం ప్రయాణించడానికి అంతమందికి వాహనాలు ఎలా దొరుకుతాయి. ఏడు గంటలకు లోపలికి వెళ్లిన విద్యార్థులు 1:30 తర్వాతే బయటకు వచ్చేది. అంటే ఆరున్నర గంటలకు పైగా పరీక్షా కేంద్రంలో ఉండే విద్యార్థులు కనీసం టిఫిన్ చేసి వెళ్లే అవకాశం కూడా లేకుండా ఏడు గంటలకు ఉదయం ఏర్పాటు చేయటం ఏమిటి ?
ఆంధ్రా వాళ్ళందరకూ హైదరాబాద్ సెంటర్ ఇచ్చారు. హైదరాబాద్ వాళ్లకు కరీంనగర్ వరంగల్ ఇచ్చారు. దీనికి బదులు కనీసం హైదరాబాద్ వాళ్లకు హైదరాబాదులో సెంటర్ ఇచ్చినా, కనీసం కొంతమందికైనా అనవసర ప్రయాణాలు దూరాభారాలు,విపరీతమైన ఖర్చులు తగ్గేవి కదా. అందరూ వేరే ప్రాంతాలకు వెళ్లడం వల్ల అక్కడ హోటళ్ళలో రూములు దొరక్క బస్టాండుల్లోనూ.. రైల్వే స్టేషన్లలోనూ పడిగాపులు పడవలసిన పరిస్థితి. ఇలా నిద్రాహారాలు లేకుండా ఇంతలా కష్టపడిన విద్యార్థులు పరీక్షలు ఏమి రాయగలుగుతారన్న కనీసపు ఇంగితం కూడా వారికి ఉండదు.
విద్యార్థులతో పాటు తీవ్రమైన శారీరక మానసిక ఒత్తిడికి ఆందోళనకు లోనైన విద్యార్థుల తల్లిదండ్రులు మాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వాల పరిస్థితి ఏమిటి ?
అండర్ గ్రాడ్యుయేట్ నీట్ లో పేపర్ లీక్ అయినట్లు ప్రభుత్వం అంగీకరించింది. యూజీసీ నెట్ లో పేపర్ లీక్ అయిందని ప్రభుత్వమే అంగీకరించి పరీక్షను అదే రోజు రద్దు చేసింది. రెండు మూడు వారాల క్రితమే జరిగిన ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నీట్ పీజీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికార యంత్రాంగం బాధ్యతా రాహిత్యాన్ని ఏమనాలి?
లీకేజీలు నివారించలేకపోవడం.. పదేపదే పరీక్షలు వాయిదాలు వేయడం.. వాయిదా వేసే విషయం కనీసం ఒకరోజు ముందు కూడా ప్రకటించలేకపోవడం.. మరుసటి రోజు ఉదయం పరీక్ష అయితే ఆ ముందు రోజు అర్ధరాత్రి వార్త బయటకు రావడం.. అర్థరాత్రి 2.30 మాత్రమే అధికారిక వెబ్సైట్లో వార్త రావడం చూస్తుంటే దేశ భవిష్యత్తు ఎటువంటి అస్తవ్యస్త అసమర్ధుల చేతిలో ఉందో చూస్తుంటే ఆందోళన కలుగుతుంది.
విశ్లేషకులు:
డా. వెనిగళ్ళ రాంబాబు
ప్రముఖ సినీ గీత రచయిత, నంది అవార్డు గ్రహీత