
తెలంగాణలో బీజేపీ(BJP) బీఆర్ఎస్(BRS) చేతులు కలపబోతున్నాయా? పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే.. రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు వ్యవహారంపై తెలంగాణలో కొంత డిస్కషన్ అయితే నడుస్తోంది. గులాబీ పార్టీ నేతలు సైతం తమ తమ కేడర్ కు ఇదే విషయంపై ఇండికేషన్స్ ఇస్తున్నారట. మరి ఈ పొత్తు వ్యవహారం ఎంత వరకు నిజమో తెలుసుకుందాం..
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ, ఆంధ్రా రాజకీయాలే కాదు.. దేశ రాజకీయాలు కూడా మారిపోతున్నాయి. బీజేపీ వరుసగా మూడవ సారి ఎక్కువ మెజారిటీ తో అధికారం లోకి రావడానికి వున్నఅన్ని అవకాశాలు ఉపయోగించుకుంటుంది, దాంతో NDA పాత మిత్రులను మరల ఆహ్వానిస్తుంది. కొత్త పార్టీలను కూడ కడుతుంది. ఇక ఈ నేపథ్యం లో ఇప్పటి వరకూ ఉప్పూ నిప్పులా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మిత్ర పక్షాలుగా మారనున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ అడుగులు వేస్తోందని సమాచారం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కమలం పార్టీతో గులాబీ దళపతి జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారట. ఈ పొత్తుల వ్యవహారంపై ఢిల్లీ స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నాయని టాక్. ఇదే విషయమై పార్టీ నేతలకు కేసీఆర్ ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చారట. ఇటీవల జరిగిన పార్టీ కీలక నేతల సమావేశంలోనూ పొత్తుల అంశాన్ని కేసీఆర్ లేవనెత్తారని వినికిడి.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారట గులాబీ బాస్. అయితే, పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు చేజారిపోతాయని BRS నేతలు ఆందోళన వ్యక్తం చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే.. బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై అసెంబ్లీ లాబీల్లో జోరుగా చర్చ జరుగుతోందట . ఇక పోతే మరికొద్ది రోజుల్లోనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కొసమెరుపు: తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ మీద ఎగరడం, ఓడిపోయి ప్రతిపక్షం లోకి రాగానే అధికార పక్షం దెబ్బకు తట్టు కోలేక బీజేపీ పొత్తు కై ప్రాకులాడటం మామూలు అయిపొయింది. ఇక BRS & BJP పొత్తు ఖాయమైతే మాత్రం కాంగ్రెస్ పని ఖాళీనే..