
APPSC Group 1 Question Paper తెలుగు అనువాద దోషాలు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో తెలుగు మాధ్యమం ప్రశ్నల తీరుతో అభ్యర్థులు బెంబేలెత్తిపోయారు. ప్రధానంగా అనువాద, అక్షర దోషాలు స్పష్టంగా కనిపించారు. దీనితో అభ్యర్థులు ఎంతో తికమక మరియు ఇబ్బందులు పడ్డారు. ఈ తప్పులు ప్రశ్నాపత్రంను ఇంగ్లిష్ నుంచి తెలుగులోనికి అనువదించడంలో దొర్లాయి. గూగుల్ ట్రాన్స్‌లేటర్ లేదా అలాంటిది ఏదైనా వాడారా? అన్నట్లు ప్రశ్నల అనువాదం జరిగింది.
ఇక తెలుగు అభ్యర్థులు ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి అటు ఆంగ్లంలో, ఇటు తెలుగులోని ప్రశ్నలను పలుమార్లు చదవాల్సి రావడంతో పరీక్ష పూర్తిగా రాయడానికి సమయం సరిపోలేదు. మరోపక్క గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో మాదిరిగానే గ్రూప్-1 ప్రిలిమ్స్‌లోనూ ప్రశ్నల నిడివి చాలా ఎక్కువగా ఉంది. వీటిని అర్థం చేసుకోవడానికి అభ్యర్థులకు చాలా సమయం పట్టింది. కొన్ని ప్రశ్నలు అయితే సివిల్స్ కంటే సంక్లిష్టంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు తెలిపారు. ఇకపోతే 63 పేజీలతో ఉన్న APPSC Group 1 Question Paper అభ్యర్థులకు ఒక అగ్ని పరీక్షే అని అని చెప్పాలి.
తెలుగు మాంద్యం లోని కొన్ని ప్రశ్నల తీరు ఓసారి పరిశీలిస్తే..
హిస్టరీ విభాగం(B – Series) 22వ ప్రశ్నలో ఇంగ్లిష్ నుంచి తెలుగులోనికి అనువదించినప్పుడు అతివాద దశ ను తీవ్రవాద దశగా అనువాదం చేశారు.
పేపరు-2లో
సైన్స్ అండ్ అండ్ టెక్నాలజీ విభాగం (C – Series) 66వ ప్రశ్నలో శరీరంలోని నాడీ వ్యవస్థకు సంబంధించి కొత్త(నావెల్) పరికరం ద్వారా నిర్థారణ పరీక్షలు అన్న ప్రశ్న తెలుగు అనువాదంలో నవల అని ముద్రించారు. దీని వల్ల అర్థం పూర్తిగా మారిపోయినట్లయింది. ఇలాంటి ప్రశ్నలు మరిన్ని వున్నాయి.
109వ ప్రశ్నలో ‘కోస్ట్ గార్డ్ సైనిక విన్యాసాలు’ అని కాకుండా ‘కోస్ట్ గార్డ్ వ్యాయామం’ అని ముద్రించారు.
89వ ప్రశ్నలో ‘జీవ విచ్ఛన్నం’ అనే పదానికి బదులుగా ‘స్మార్ట్ బయోడిగ్రేడబుల్’ అని ఇంగ్లిష్‌లోనే యథాతథంగా ఇచ్చారు.
మరో ప్రశ్నలో తెలుగులో ‘భ్రూణం’ అని ముద్రించాల్సి ఉండగా ‘పిండం’ అని ముద్రించారు.
జైన మతరచనల గురించి అడిగిన ప్రశ్నలో ప్రాకృతంకు బదులుగా కృతాన్ని, జైనులు అనే పదానికి ప్రాజైనులు అని ముద్రణ అయింది.
ఇక మరోప్రశ్నలో పార్లమెంటరీ విశేషాధికారాలు అని కాకుండా పార్లమెంటరీ అధికారాలు అని. ఇదే ప్రశ్నలో వైడర్ ఇంప్లికేషన్స్ అనే పదాన్ని “విస్తృత పరిణామాలు” కి బదులు “విస్తృతమైన చిక్కులు” గా ముద్రించారు.
ఇలా చాలా ప్రశ్నలు తెలుగులో అర్థరహితంగా ఇచ్చారు. ప్రశ్న పత్రంలో ముద్రణా పరంగానూ కొన్ని తప్పులు దొర్లాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే APPSC Group 1 Question Paper తెలుగు అనువాదానికి తెగులు పట్టింది
కొసమెరుపు: అంత పెద్ద వ్యవస్థను కలిగి వున్న APPSC ఇలా చేసిన తప్పులనే మరల మరలా చేస్తూ, ఇంకెన్ని రోజులు నిరుద్యోగులతో ఆడుకుంటుందో. కొత్త ప్రభుత్వంలో అయినా దీని ప్రక్షాళన జరుగుతుందేమో చూద్దాం.