
ఇప్పుడు ఏపీ లో ఇతర పార్టీల నేతలకు టీడీపీ(TDP), జనసేన(Janasena) కూటమి హాట్ ఫేవరేట్ గా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏదో ఓ పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ త్వరలోనే జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. అప్పట్లో వైస్సార్ బతికి ఉన్న రోజుల్లో, కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన ఆయన తర్వాత వైసీపీలో చేరి రాజకీయంగా దెబ్బతిన్నారు. గత కొద్ది కాలంగా ఖాళీగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు యాక్టివ్ అవుతున్నారు. ఆయన Janasena నేతలతో మాట్లాడుతున్నట్లు గా తెలుస్తోంది.
2009లో ఓడిపోయినప్పటికీ కొంత కాలం వరకు ఆయన హవా నడిచింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ పార్టీ ఓడిపోవడం, విశాఖ ఎంపీ సీటులో ఎదురైన వైఫల్యాలు కొణతాలను వైఎస్ జగన్ దూరం పెట్టారు. ఆ తర్వాత రాజకీయాలు పక్కన పెట్టేసిన రామకృష్ణ సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పలు అధ్యయన వేదికలు, సభలు నిర్వహించేవారు. రైతు సమస్యలు, చెరకు సాగు ఇబ్బందులు, సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు మూత పడటం వంటి వాటిని అజెండాగా పెట్టుకుని వీలున్నప్పుడల్లా నియోజకవర్గాల్లో తిరుగుతూ వచ్చారు.
Janasena లోకి కొణతాల
అనకాపల్లిలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాతే జనసేనలో చేరికపై కొణతాల క్లారిటీ ఇస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. పవన కల్యాణ్(Pawan Kalyan) తో ఇప్పటికే మాట్లాడారని కూడా అంటన్నారు. ఒకప్పుడు కొణతాల ఉమ్మడి విశాఖజిల్లాలో బలమైన గవర సామాజిక వర్గం ప్రతినిధిగా చెలామణీ అయ్యారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో పదేళ్లు పదవుల్లో ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన కొణతాల, కేవలం తొమ్మిది ఓట్లతో గెలిచారు. ఒక ఎంపీ సింగిల్ డిజిట్ మెజారిటీతో గెలవడం ఇప్పటికీ రికార్డే.
గత ఎన్నికల ముందు టీడీపీ ఆహ్వానం మేరకు చంద్రబాబును కలిశారు. కానీ టీడీపీ నేతల వర్గ పోరాటం వల్ల చేరలేకపోయారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు కొణతాల రామకృష్ణ జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలని కొణతాల భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటులో ఉత్తరాంధ్రలో అనకాపల్లి పార్లమెంట్ సీటు జనసేనకు వస్తే బలమైన అభ్యర్థి అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.