Pawan Speech in Yuvagalam

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్ర బాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, టీడీపీ-జనసేన పొత్తు ఎందుకు ముఖ్యమో వివరించడంలో ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు, అదే సమయంలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ కు ప్రజాస్వామ్య విలువలు తెలియవని విమర్శించారు. తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని వాడు ప్రజలకు ఎందుకు ఇస్తాడని పవన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దూషిస్తారా అని ప్రశ్నించారు. వారాహి యాత్రలో తనపై దాడులు చేశారని ఆరోపించారు.
Pawan Speech in Yuvagalam: పొత్తు పై
ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది భవిష్యత్ బాగుండాలనే టీడీపీ తో పెట్టుకున్నాను. రాష్ట్ర భవిష్యుత్తు దృష్ట్యా వైసీపీ వ్యతిరేక ఓటు చీల కూడదనే ఈ నిర్ణయం. వ్యక్తి గత, వర్గ, పార్టీ ప్రయోజనాలు దాటి వచ్చాను. ఇప్పటం సభలో తీసుకున్న నిర్ణయం నీటి సభతో నిజమైందన్నారు. ఇప్పుడు పొత్తు లేకపోతే మళ్ళీ వైసీపీ పాలన వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఉండలేరు, నాతో సహా అందరు వైసీపీ గూండాలను ఎదుర్కోవడానికి వీధి పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్రం లోని భాజపా పెద్దలకు వివరించాను. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మారాలంటే టీడీపీ తో కలసి వెళ్లాల్సిన ఆవశ్యకతను చెప్పాను. టీడీపీ, జనసేన పొత్తుకు బిజెపి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నట్టుగా పవన్ చెప్పారు. 2014లో టీడీపీ, బీజేపీతో కలిసి అడుగులు వేశానని, కానీ, సమాచార లోపం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల 2019లో ఒంటరిగా జనసేన బరిలోకి దిగిందని చెప్పారు. ఆ పరిణామంతో 2019 ఎన్నికల్లో జగన్ గెలిచి రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తెచ్చారని అన్నారు. అందుకే, 2024లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన పొత్తు అనివార్యమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కుదురుకునే వరకు పొత్తు కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందిస్తామని, టీడీపీతో కలిసి జనసేన సంయుక్తంగా కార్యక్రమాలు రూపొందిస్తుందని పవన్ చెప్పారు.భవిష్యత్తులో జరగబోయే మరో సభలో ఉమ్మడి కార్యాచరణను విడుదల చేస్తామని అన్నారు.
Pawan Speech in Yuvagalam: మార్చాల్సింది జగన్ నే
జగన్ ఇప్పటికే 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 80 మందిని మారుస్తారంట. అసలు మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.., జగన్ నే ముందు మార్చాలన్నారు. 2024లో అధికార మార్పిడి జరగనుంది. టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, జగన్‌ను ఇంటికి పంపిస్తామని పవన్ అన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కక్ష సాధింపు వ్యక్తి అని, దశాబ్దాల రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైఎస్ తో సహా ఎవరూ…ఇంట్లో ఆడవాళ్లపై దూషణలకు దిగలేదని అన్నారు.

Pawan Speech in Yuvagalam: మరికొన్ని
యువగళం సభకు నన్ను ఆహ్వానించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు .. 220రోజులు, 97 నియోజకవర్గాల్లో 3వేలకు పైగా చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలు లోకేష్ తెలుసుకున్నారని ఇది లోకేష్ గారి రోజు, అటు వంటి సభలో నేను ఉండటం సబబా అని అడిగానన్నారు. అయితే లోకేష్ గారు, చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు నేను మనస్పూర్తిగా ఇక్కడకు వచ్చాననని తెలిపారు.
ఇక, లోకేష్ చేసింది జగన్ చేసినటువంటి పాదయాత్ర కాదని పవన్ అన్నారు. జగన్ పాదయాత్ర చాలా కృత్రిమంగా ఉందని, ప్రజల చెంపలను ముద్దాడుతూ అందరినీ శారీరకంగా ఆలింగనం చేసుకుంటూ సాగిందని పవన్ అన్నారు. లోకేశ్ యాత్ర ప్రజల కష్టాలు తెలుసుకోవడంతోపాటు సరైన ఉద్దేశ్యంతో సాగింది. లోకేష్ చాలా దమ్ము, పట్టుదల చూపించాడు. నేను నడుద్దాం అంటే… నన్ను నడవనిచ్చే పరిస్థితి ఉండదన్నారు. పాదయాత్ర ద్వారా చాలా మంది సాధకబాధకాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని.. నాకు అటువంటి అవకాశం లేకపోవడం కొంత బాధగా కూడా ఉందన్నారు. లోకేష్ చేసింది మాటల పాదయాత్ర కాదని, చేతల పాదయాత్ర అని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలు వింటూ లోకేష్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని పాదయాత్రను విజయవంతంగా ముగించారని చెప్పారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకు, జగన్ ను సోనియా గాంధీ జైలులో పెట్టారని అన్నారు . ఆ కక్ష చంద్రబాబుపై చూపించడం అవివేకమన్నారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని భావించానని, ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
ఎపీ స్పూర్తి నేడు భారతదేశానికే చేలా కీలకమని.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే పొట్టి శ్రీరాములు బలిదానం కారణమన్నారు. ఆయన స్పూర్తి వల్లే ఎపీ అవతరించింది. ఐ.ఎ.యస్ లు, ఐపీయస్ లు ఉమ్మడి ఎపీలోకి రావాలని తెగ కోరుకునే వారు. ఎపీ ఒక మోడల్ స్టేట్ అని, అందరూ అక్కడ పని చేయాలని బావించే వారు… నేడు ఎపీకి ఎవరు రాని పరిస్థితికి జగన్ తీసుకు వచ్చారన్నారు.
వాలంటీర్ల వ్యవస్థ ను అడ్డం పెట్టుకుని ఒంటరి మహిళల డేటాను సేకరించేలా చేశారు.. నన్ను మాట్లాడమని కొంతమంది చెబితే.. నేను డేటాను తెప్పించుకుని చూసి ఆశ్చర్యపోయానన్నారు. కొంతమంది వాలంటీర్లు చేసే విధానాల వల్ల ఒంటరి మహిళలు, వితంతువులు చాలా అన్యాయానికి గురవుతున్నారని అన్నారు.
నేను ఎప్పుడు గొంతు ఎత్తినా ఓట్లు కోసం కాదు. మార్పు కోసం పని చేస్తానన్నారు. వారాహి యాత్ర చేస్తే నాపై అనేక కువిమర్శలు చేశారు విశాఖలో పోలీసులతో అడ్డుకునేలా చేసి.. ఒక ఉన్నతాధికారి నాపై నీచంగా వ్యవహరించారు. అన్ని శాఖలకు పెద్ద మనిషి అయినా ఓ వ్యక్తి ఆ పోలీసు అధికారికి ఆదేశాలు ఇస్తున్నాడు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇలా పరిస్థితి ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రజలు బతకలేరన్నారు. పెట్టుబడులు రావు.. పరిశ్రమలు ఉండవు..ఎవరూ ఎపీలోకి రారు.
త్వరలోనే జనసేన, టీడీపీ ఉమ్మడి మ్యానిఫెస్టో ను ప్రకటిస్తామని.. ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలు, యువత, మహిళలు అందరికీ మేలు చేసేలా పాలన సాగిస్తామన్నారు. పంచాయతీల బలోపేతం, దళితులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంఖ్యా బలం లేని బీసీ కులాలకు అండగా ఉండేలా ఎక్సైసైజ్ చేస్తున్నామని.. చంద్రబాబుగారు, మేము , కలిసి మాట్లాడుకుని త్వరలోనే మరో సభలో ప్రకటిస్తామన్నారు. ఇది లోకేష్ సభ కాబట్టి.. పరిమితంగానే మాట్లాడుతున్నానని.. ఈ మైత్రి , ఈ స్పూర్తి అందరం సమిష్టగా చాలా సంవత్సరాల పాటు కాపాడుకోవాలని ఆశిస్తున్నానన్నారు. హలో ఎపీ… బైబై వైసీపీ అనేది ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలన్నారు.