
PK meets CBN అనగానే పవన్ కళ్యాణ్ బాబును కలిశారు అనుకుంటున్నారా! దానిలో పెద్దగా సంచలనం ఏముంది అంటారా? కానీ ఇక్కడ సీబిన్ ని కల్సింది దేశంలోనే గొప్ప వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్!
ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఏపీ లో జరుగుతున్న పరిణామాలు పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి . ఇక ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్న టీడీపీ, ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది మరియు ఏపీలో వారితో కలిసి ఉమ్మడి ఎన్నికల ప్రచారానికి సిద్ధమౌతోంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో భేటీ.
PK meets CBN
టీడీపీ గెలుపు అవకాశాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఈరోజు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సీబీన్ భేటీ అయ్యారు. అంతకు ముందు గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్, ప్రశాంత్ కిశోర్ ఒకే వాహనంలో కలిసి ఉండవెల్లి లో వున్న బాబు నివాసానికి వెళ్లారు. ఇప్పటి వరకూ టీడీపీ తరఫున రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. రాబిన్ శర్మ సైతం ఇంతకు ముందు పీకే టీంలోనే పనిచేశారు. తర్వాత సొంత సంస్థ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీకి కారణం ఏమిటన్నది మాత్రం క్లారిటీ లేదు. టీడీపీ కోసం పని చేస్తారా.. సలహాలిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ టీడీపీ కోసం పనిచేస్తే రాబిన్ శర్మ స్థానంలో పీకే బాధ్యతలు చేపడతారా లేదా ఇద్దరూ పని చేస్తారా అనేది త్వరలో తెలియనుంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగా పీకే వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో వైసీపీ కి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్, ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పాలనా తీరుకు వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు చేశారు. వివిధ మీడియా చానళ్ల డిబేట్స్ లో పాల్గొన్నప్పుడు..ఏపీలా అప్పులు చేసి పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డితో పని చేసి గెలిపించినందుకు తనను ఇప్పుడు విమర్శిస్తున్నారని కూడా ఓ సారి చెప్పారు. అలాంటి వ్యతిరేక వ్యాఖ్యల తర్వాత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం సహజంగానే రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీడీపీకి పని చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి కనబరుస్తున్నారని గతంలో జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు నేరుగా టీడీపీ హైకమాండ్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం.. సంచలనంగా మారింది. ఇది వైసీపీ క్యాంపును కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పవచ్చు.
కొస మెరుపు:
ఎన్నికల టైంలో గెలిచే పార్టీలోకి జంప్ అవడం రాజకీయ నాయకులకు అలవాటు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని చూస్తే వ్యూహకర్తలు కూడా గెలిచే పార్టీలకే పని చేస్తారనిపిస్తుంది!