
YS Sunita రాజకీయ ప్రకటన
ఇప్పటికే YS సునీత(YS Sunita) వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పైన వివేకా హత్య కేసులో పలు ఆరోపణలు చేసారు. అవినాశ్ పైన న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశంలోనూ వచ్చే ఎన్నికల్లో తన సోదరులకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న వైఎస్ వివేకా అయిదో వర్దంతి రోజున పులివెందుల వేదికగా రాజకీయ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇక వివేకా హత్య తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలు ఈ ఎన్నికల వేళ కొత్త రాజకీయ సమీకరణాలకు కారణంగా నిలుస్తున్నాయి. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ (Sowbhagyamma) కడప ఎంపీ లేదంటే పులివెందుల నుంచి పోటీ చేయాలనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు టాక్ వస్తుంది. వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మను కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశం పరిశీలించాలని ఆ జిల్లా టీడీపీ(TDP) నేతలు కొందరు అధిష్ఠానం ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే జరిగితే వైఎస్ ఫ్యామిలీలో ఊహించని పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇకపోతే వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా ఈ నెల15న కడపలో ఆత్మీయ సమావేశం లో అభిమానులతో సునీతా రెడ్డి తమ రాజకీయ ప్రవేశం గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. దానితో పాటు సౌభాగ్యమ్మను కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ బరిలోకి దింపే ఆలోచనపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. తమ కుటుంబం రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు.. కారణాలను పులివెందుల, కడప జిల్లా ప్రజలకు తెలియచేసేందుకే ఆత్మీయ సమావేశమని తెలుస్తోంది.
-By Guduru Ramesh Sr. Journalist