![YCP Changing Candidates? కడప ఎంపీతో పాటు మరి కొంతమంది వైసీపీ అభ్యర్థుల మార్పు? ఓటమి భయం వల్లేనా?](https://samacharnow.in/wp-content/uploads/2024/04/YCP-Changing-Candidates.webp)
Why YCP Changing Candidates?
ఊరందరి కంటే వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఆ తరువాత అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ (YCP) అభ్యర్థులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇకపోతే తాజాగా కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మారుస్తారంటూ (YCP Changing Candidates) సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. కూటమి నుంచి బలమైన అభ్యర్థులు ఉండటంతో.. ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు వారిని ఎదుర్కోవడం కష్టమని భావించి.. కొన్ని స్థానాల్లో YCP అభ్యర్థులను మార్చాలనే(YCP Changing Candidates) ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
వైస్ షర్మిల కడప ఎంపీ గా పోటీ చేస్తుండడం మరియు “వివేకానంద రెడ్డి హత్యకు(Viveka’s Murder) సంబంధించి యర్ర గంగిరెడ్డి సాక్షాలను తారుమారు చేస్తూ ఉంటే అవినాష్ చూస్తూ ఉండిపోయాడని” అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తోడవ్వడంతో కడప ఎంపీ అభ్యర్థిని కూడా మారుస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా వున్న అవినాష్ కి జగన్ టికెట్ ఇచ్చారంటూ షర్మిల ప్రచారం చేస్తున్నారు. మరోవైపు షర్మిల ఓట్లు చీల్చడం ద్వారా అవినాష్ రెడ్డి ఓడిపోతే సొంత జిల్లాలో జగన్ ప్రతిష్ట మసకబారుతుందనే ఉద్దేశంతో ఇక్కడ అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి స్థానంలో అభిషేక్ రెడ్డి బరిలో దింపే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
ఇక పోతే ప్రస్తుతం పెనమలూరు అభ్యర్థిగా జోగి రమేష్(Jogi Ramesh) ను మైలవరం కి పంపించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వైసీపీ ప్రస్తుత మైలవరం అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, వసంత కృష్ణప్రసాద్‌కు గట్టిపోటీ ఇవ్వలేరనే ఉద్దేశంతో ఆయన్ను తప్పించి జోగి రమేష్‌ను మైలవరానికి పంపిస్తు్న్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా వున్నషేక్ ఆసిఫ్‌ను తప్పించి ఆయన స్థానంలో ఇటీవలే జనసేన(Janasena) నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్‌కు టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్న విడుదల రజనీని గుంటూరు ఎంపీగా పంపించి.. గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది.
ఇవన్నీ జరిగితే మాత్రం వైసీపీ ని ఓటమి భయం వెన్నాడుతుందని ప్రజలు అనుకోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.