
APPSC Group 1 Mains 2018 Cancelled
ఆంధ్రప్రదేశ్‌లో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను చేతితో దిద్దడం విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ.. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మొదటిసారి దిద్దిన ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా.. రెండోసారి మూల్యాంకనం చేసి, నచ్చిన వారిని ఎంపిక చేసి ఏపీపీఎస్సీ(APPSC) ఫలితాలను వెల్లడించిందని వారు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు(High Court), గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని.. పరీక్షను రద్దు చేస్తూ(Group 1 Mains 2018 Cancelled).. మార్చి 13న తీర్పు వెల్లడించింది. . ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను తిరిగి ఆరు నెలల్లోపు నిర్వహించాలంటూ ఏపీపీఎస్సీకి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
2018లో 167 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ హైకోర్టుని అశ్రయించారు కొందరు అభ్యర్ధులు. అయితే తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఎపీపీఎస్సీ వాదించింది. ఇరువర్గాల వాదనల అనంతరం.. మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సిందేనని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు.
అయితే హైకోర్టు తీర్పుపై గ్రూప్ 1 ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని అంటోంది. ఈ క్రమంలో సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించింది.