
TS EAPCET 2024 Dates Changed
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ(Telangana)లో జరగాల్సిన కొన్ని ప్రవేశ పరీక్షల తేదీలు మారాయి. ఇందులో ముఖ్యంగా TS EAPCET 2024 పరీక్ష తేదీలు మారాయి(TS EAPCET 2024 Dates Changed). దానితో పాటు టీఎస్ ఐసెట్(TS ICET 2024) పరీక్షల షెడ్యూలులో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీఎస్ ఎప్‌సెట్ పరీక్షలను మే 9 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరీక్షలకు, ఎన్నికల తేదీకి ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందుగానే ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇక టీఎస్ ఐసెట్ తేదీలను ఒకరోజు వెనక్కు జరిపారు.
Also Read: ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. TS EAPCET 2024 సంగతేమిటి?
మారిన షెడ్యూలు ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు నిర్వహించాల్సిన ఈఏపీసెట్ 2024 పరీక్షలను మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు; మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు.
అలాగే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4, 5వ తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా ఐసెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
