
డా. వై.ఎస్. సునీత కు IDSA Fellowship
అపోలో హాస్పిటల్ లో డాక్టర్ గా సేవలందిస్తున్న దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఐ.డీ.ఎస్.ఏ ఫెలోషిప్ కు(IDSA Fellowship) ఎంపికైనట్లుగా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (IDSA) ప్రకటించింది. ఇది అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు లభించే అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం.
డాక్టర్ సునీత యొక్క అంకితభావం, నైపుణ్యం, అంటు వ్యాధులపై అవగాహన, నివారణ, చికిత్సను అభివృద్ధి చేయడంలో నిబద్ధత, రోగుల సంరక్షణ తదితర అంశాలు ఆమెకు ఈ ఫెలోషిప్ లభించడంలో దోహదపడ్డాయని, ఈ లక్షణాలు ఐడీఎస్‌ఏ సంస్థకు ఎంతగానో దోహదపడతాయని ఐడీఎస్‌ఏ అధ్యక్షుడు డాక్టర్ స్టీవెన్ కె. స్మిత్ (Steven K. Schmitt) అన్నారు.
ఐడీఎస్ఏ ఫెలోషిప్ దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని డాక్టర్ YS సునీత(YS Sunita) అన్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు పొందినందుకు డా. సునీతను అభినందిస్తున్నామని, అంటు వ్యాధులను ఎదుర్కొవడంలో ఆమె అలుపెరగని అంకితభావం, ఆరోగ్య సంరక్షణలో నిబద్ధత అపోలో హాస్పిటల్స్‌కి(Apollo Hospitals) గర్వకారణం అని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు.
-By VVA Prasad