మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు Bill Gates, Vacations గురించి కామెంట్స్ చేశారు. సంస్థలో పనిచేసే తొలిరోజుల్లో వీకెండ్ సెలవులు తీసుకోవడం పనిచేయకుండా ఉండటం తనకు అస్సలు నచ్చేది కాదని అన్నారు. కానీ తండ్రయ్యాక మాత్రం తన అభిప్రాయం మారిపోయిందని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ‘నేను నా పిల్లల వయసులో ఉన్నప్పుడు సెలవులపై అంత ఆసక్తి ఉండేది కాదు. తండ్రిని అయ్యాకే నా అభిప్రాయం మారింది. పని కంటే జీవితం ఎంతో విలువైందని గ్రహించా’ అని బిల్ గేట్స్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు.
తన పిల్లల ఎదుగుదల చూడటం ఎంతో హాపీ గా ఉందన్నారు. గోల్ కీపర్స్ ఈవెంట్‌లో తన చిన్న కూతురు ఫోబ్‌తో తాను వేదిక పంచుకోవడం తనకు సంతోషం వేసిందన్నారు. ఈ సంవత్సరంలో జరిగిన ముఖ్యాంశాల్లో ఇది కూడా ఒకటని ఆయన చెప్పుకొచ్చారు.
Bill Gates on Work Life Balance
పని- జీవితం సమతుల్యత (Work Life Balance) గురించి ప్రపంచ కుబేరుడు గేట్స్ మాట్లాడటం ఇదేం తొలిసారి కాదు. ఈ సంవత్సరం ఆరంభంలో అరిజోనా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిల్ గేట్స్.. విద్యార్థుల్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అప్పుడు
‘జీవితాన్ని ఆస్వాదించడం కూడా మరిచిపోయేలా కష్టపడొద్దు. పని కంటే జీవితమే ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకునేందుకు నాకు చాలానే సమయం పట్టింది. మీరు మాత్రం అంత సమయం వేచిచూడొద్దు. మీ బంధాల్ని బలపరుచుకునేందుకు.. విజయాన్ని పంచుకునేందుకు.. నష్టాల నుంచి కోలుకునేందుకు కొంత సమయం వెచ్చించండి.’ అని స్టూడెంట్స్ కి సూచించారు.