
GST Council meeting
శనివారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో(GST Council meeting) చిరు వ్యాపారులకు, సామాన్య ప్రజలకు మేలు కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రం భావిస్తోంది అని, ఈ విషయంలో రాష్ట్రాలే ఏకమై తుది నిర్ణయం తీసుకోవాలి అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాలు అభివృద్ధిని కొనసాగించడానికి కేంద్రం పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహార బకాయిలను సకాలంలో చెల్లిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. తాము సూచించిన సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల కాలవ్యవధితో వడ్డీలేని రుణాలను అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
జీఎస్టీ జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనలు చేసింది అని ఆమె వెల్లడించారు. ఆగస్టు చివరి వారంలో జీఎస్టీ పాలకమండలి మరోసారి భేటీ అవుతుందన్నారు.
కీలక నిర్ణయాలు..
ప్రయాణికులకు రైల్వేలు అందించే పలు సేవలపై (ఉదాహరణకు రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్లు, ప్రయాణికులు బసచేసే గదులు, విశ్రాంతి గదులు, లగేజీ సేవలు, బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలు మొదలైనవి) జీఎస్టీ నుంచి మినహాయింపు..
విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ.20,000 వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు..
అన్ని రకాల సోలార్ కుక్కర్‌లపై 12 శాతం జీఎస్టీ..
స్టీల్, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసే పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ..
అన్ని కార్టన్ బాక్సులపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు..
స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు..
వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టబోయే వేతన జీవులు, ఇతరత్రా వర్గాలకు కొన్ని మినహాయింపులు..
జీఎస్టీ చెల్లించే చివరి తేదీ పొడిగింపు.. జీఎస్టీపై ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితిని పెంపు..
ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ విషయంలో మార్పులు, అక్రమాలు జరగకుండా ఆధార్ ఆథెంటిఫికేషన్ తప్పనిసరి..