India thrashed South Africa in Third T20: శతకంతో చితక్కొట్టిన సూర్య, కుల్‌దీప్‌ దెబ్బకు కుదేలు ఐన దక్షిణా ఆఫ్రికా

India thrashed South Africa in Third T20: మూడవది చివరిదైన T20 లో అన్ని రంగాల్లో రాణించి దక్షిణా ఆఫ్రికా పై భారీ విజయంతో సిరీస్ ను సమం చేసిన టీమిండియా
Share the news
India thrashed South Africa in Third T20: శతకంతో చితక్కొట్టిన సూర్య, కుల్‌దీప్‌ దెబ్బకు కుదేలు ఐన దక్షిణా ఆఫ్రికా

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మనవాళ్ళు రెచ్చిపోయి ఆడి దక్షిణా ఆఫ్రికా పై గ్రాండ్ విక్టరీ తో సిరీస్‌ను సమం చేశారు సఫారీ గడ్డపై . కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటుతో విధ్వంసం సృష్టించగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ బంతితో మాయ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించి భారత జట్టు సిరీస్‌ను సమం చేసింది. రెండో టీ 20లో భారీ స్కోరు చేసినా ఓడిపోయిన టీమిండియా… మూడో టీ 20లో అద్భుతంగా పుంజుకుని ఆతిథ్య జట్టును మట్టి కురిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణ ఆఫ్రికా ఏ దశలోనే గెలిచేలా అనిపించలేదు. చివరికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. దీంతో 106 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

నిర్ణయాత్మకమైన మూడో T20 లో టాస్‌ గెలిచిన దక్షిణ ఆఫ్రికా… టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి రెండు ఓవర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ ధాటిగా ఆడారు.తొలి ఓవర్లో బర్గర్‌ బౌలింగ్‌లో శుభమన్‌గిల్‌ రెండు ఫోర్లు బాదేశాడు. మార్‌క్రమ్‌ బౌలింగ్‌లో ఫోర్‌, సిక్స్‌ కొట్టి జైస్వాల్‌ కూడా మంచి టచ్‌లో కనిపించాడు. కానీ మూడో ఓవర్లలో జట్టు స్కోరు 29 పరుగుల వద్ద టీమిండియాకు షాక్‌ తగిలింది. ఆరు బంతుల్లో ఎనిమిది పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌ను మహరాజ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 29 పరుగుల వద్ద భారత జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం ఆడిన తొలి బంతికే తిలక్‌ వర్మను కూడా మహరాజ్‌ అవుట్‌ చేశాడు. దీంతో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడ్డాయి. ఈ సంతోషం సఫారీలకు ఎంతోసేపు నిలవలేదు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సారధి సూర్యకుమార్‌ యాదవ్‌… క్రీజులో నిలదొక్కుకున్న యశస్వి జైస్వాల్‌ దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. జైస్వాల్‌ వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. ఆరంభంలో సూర్య ఆచితూచి ఆడాడు. సూర్య నెమ్మదించడంతో స్కోరు బోర్డు నిదానంగా కదిలింది. సూర్య తానెదుర్కొన్న తొలి 24 బంతుల్లో 26 పరుగులే చేశాడు. టీమిండియా 10 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. పది ఓవర్ల తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ సిక్స్‌ల మోతతో కనువిందు చేశాడు. మహరాజ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో మొదలు పెట్టిన సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.13వ ఓవర్లో ఫెలుక్వాయో బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఏకంగా 23 పరుగులు చేసాడు. వరుసగా 6, 4, 6, 6 బాదడంతో ఆ ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. బర్గర్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6 కొట్టాడు. ఈ విధ్వంసంతో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 32 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన సూర్య.. మరో 23 బంతుల్లోనే శతకానికి చేరుకున్నాడు. 56 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సులతో సూర్య శతకాన్ని అందుకున్నాడు. చివరి ఓవర్‌ తొలి బంతికి రెండు పరుగులు తీసి శతకం పూర్తి చేసిన సూర్య ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్‌ 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. టీమిండియా ఇంకా భారీ స్కోరు చేసేదే కానీ చివరి రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 15 పరుగులే చేసింది. 19వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చిన షంసి.. రింకు (14)ను ఔట్‌ చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

See also  Akash Deep: తొలి టెస్ట్.. తొలి రోజు.. తొలి సెషన్.. తన తొలి 6 ఓవర్లలోనే మూడు వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ ఎవరు?

India thrashed South Africa in Third T20

202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలను కుల్‌దీప్‌ యాదవ్‌ చుట్టేశాడు. రెండో ఓవర్లోనే జట్టు స్కోరు నాలుగు పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. నాలుగు పరుగులు చేసిన బ్రీజ్కేను ముకేశ్‌ బౌల్డ్‌ చేశాడు. ఎనిమిది పరుగులు చేసిన హెండ్రిక్స్‌ రనౌటయ్యాడు. ప్రమాదకర బ్యాటర్‌ క్లాసెన్‌ను అర్ష్‌దీప్‌ అవుట్ చేసాడు. ఏడో ఓవర్లో మార్‌క్రమ్‌ నాలుగో వికెట్‌గా ఔటయ్యేటప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 42. ఓ వైపు మిల్లర్‌ నిలిచినా మరో వైపు నుంచి భారత్‌ వికెట్ల తీస్తూ పోయింది. మిల్లర్‌కు కాసేపు సహకరించిన ఫెరీరాను కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేయగా.. ఫెలుక్వాయోను ఓ రిటర్న్‌ క్యాచ్‌తో జడేజా పెవిలియన్ కు పంపాడు. దక్షిణాఫ్రికా 11 ఓవర్లలో 82 పరుగులు చేయగలిగింది. కేశవ్‌ మహరాజ్‌ ను కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు. చివరి 8 ఓవర్లలో దక్షిణాఫ్రికా 113 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్‌ విజయం దాదాపుగా ఖాయమైంది. అప్పటికి ఒక్క మిల్లర్‌ మాత్రమే అడ్డు. కానీ అతడికి అద్భుతం చేసే అవకాశం ఇవ్వలేదు కుల్‌దీప్‌. అద్భుత బౌలింగ్‌ను కొనసాగించిన అతడు 14వ ఓవర్లో బర్గర్‌, విలియమ్స్‌, మిల్లర్‌లను ఔట్‌ చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. కుల్‌దీప్‌ కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించాడు.

Also Read News

Scroll to Top