![India win quickest Test match: అత్యంత తక్కువ బాల్స్ లో ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం](https://samacharnow.in/wp-content/uploads/2024/01/India-win-quickest-Test-match.webp)
India win quickest Test match
సౌతాఫ్రికాతో ఆడుతున్న రెండు టెస్ట్ ల సీరీస్ లోని రెండో టెస్టు మ్యాచ్‌ను భారత్ 7 వికెట్ల తేడాతో తన విజయాల ఖాతాలో జమ చేసుకున్నది. దీంతో టెస్టు సిరీస్ 1-1తో సమం అయ్యింది. న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా కేప్ టౌన్ లో జరిగిన రెండో టెస్టు ఆనూహ్యంగా కేవలం ఒకటిన్నర రోజులలోనే (ఐదు సెషన్లలోనే) అదీ 107 overs (642 balls) లోనే ఫలితం వచ్చేసింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి, తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 55 పరుగులకే ఆలౌట్ అవ్వగా. ఆ తర్వాత తమ మొదటి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 153 పరుగులు చేసింది. ఈ రెండు ఇన్నింగ్స్ కూడా మొదటి రోజే ముగియడం ఒక విశేషం. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ కూడా మొదటి రోజే మొదలుపెట్టిన సౌతాఫ్రికా జట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. దాంతో ఒకే రోజు 23 వికెట్లు పడిన రికార్డు నమోదయ్యింది. మరుసటి రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా ఐడెన్ మార్క్‌రమ్ (106) చేసిన సెంచరీ పుణ్యమా అని 176 పరుగులు చేయగలిగింది. దీంతో ఆ జట్టుకు 78 పరుగుల ఆధిక్యం లభించింది.
79 పరుగుల లక్ష్యంతో తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత జట్టు ఆడిన 12 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 80 పరుగులు చేసి విజయాన్ని చేజిక్కించుకుంది. అయితే.. భారత్ గెలుపులో ఈసారి బౌలర్లు కీలక పాత్ర పోషించారని చెప్పాలి. సిరాజ్, బుమ్రా లు చెరో అరడజను వికెట్లను ఒక్కో ఇన్నింగ్స్ లో ఆవురావురమంటూ అందుకున్నారు. ఇక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే, తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో కాసేపు మెరుపులు మెరిపించాడు. 6 ఫోర్ల సహకారంతో 23 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ 17, శుభ్‌మన్ గిల్ 10, విరాట్ కోహ్లీ 12, శ్రేయస్ అయ్యర్ 4 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, బర్గర్, యాన్సెస్ తలా వికెట్ పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్
తొలి టెస్టు మ్యాచ్ గెలుపు ఉత్సాహంలో ఉన్న ప్రత్యర్థి జట్టు, రెండో టెస్టులోనూ అదే దూకుడు కొనసాగించాలని అనుకుని వుంటుంది. కానీ ఆటల్లో అనుకున్నవి జరగక పోవడం ఎంతో సహజం. అందులో క్రికెట్ లో ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మహమ్మద్ సిరాజ్ (6/15) పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టాడు. నిప్పులు చెరిగే బంతులను బౌల్ చేసి సౌతాఫ్రికా బ్యాటర్లందరూ గుడ్లు తేలేశాల చేశాడు సిరాజ్. దాంతో తోలి రోజు, తొలి సెషన్‌లోనే 23.2 ఓవర్లలోనే ప్రత్యర్థి జట్టు 55 పరుగులకే డ్రెస్సింగ్ రూంకు చేరింది. టెస్టుల్లో భారత్ పైన సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. సిరాజ్ ఆరు వికెట్లతో స్వైర విహారం చేయగా.. ముకేశ్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read: IND vs SA 2nd Test in Cape Town.. 23 Wickets in one Day: రెండో రోజే ఫలితం తేలనుందా?
అటు పిమ్మటతొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. మొదట్లో మెరుగ్గా రాణించింది. యశస్వీ జైస్వాల్ డకౌట్ అయినప్పటికీ.. రోహిత్ శర్మ (39), శుభ్‌మన్ గిల్ (36), విరాట్ కోహ్లీ (46) మంచి ప్రదర్శన కనబరిచారు. ఇది చూసి.. భారత్ మెరుగైన స్కోరే చేస్తుందని అంతా భావించారు. కానీ,153 స్కోర్ వద్ద భారత జట్టు వరుసగా ఆరు వికెట్లు కోల్పోయింది. యశస్వీతో కలుపుకుంటే మొత్తం ఆరుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే బ్యాటును చంకలో పెట్టుకుని వెనక్కి వచ్చేశారు. మొత్తానికి ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి, సౌతాఫ్రికాపై భారత్ 98 పరుగుల(భారీ) ఆధిక్యాన్నిసాధించగలిగింది.
ఈ టెస్ట్ మ్యాచ్ లో నమోదయిన రికార్డులు
- India win quickest Test match: 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో(642) ముగిసిన టెస్ట్ మ్యాచ్ గా ఈ మ్యాచ్ రెకార్డుకెక్కింది.
- కేప్ టౌన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో కేప్ టౌన్ లో గెలిచిన మొదటి ఆసియన్ కంట్రీ గా భారత్ నిలిచింది
అతి తక్కువలో బంతుల్లో ముగిసిన టెస్టుమ్యాచ్ లు
- 642 – దక్షిణాఫ్రికా Vs భారత్ (కేప్టెన్) 2024
- 656 – ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (మెల్బోర్న్) 1932 –
- 672 – వెస్టిండీస్ vs ఇంగ్లాండ్ (బ్రిడ్జిటౌన్) 1935
- 788 -ఇంగ్లాండ్ VS ఆస్ట్రేలియా (మాంచెస్టర్) 1888
- 792 – ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (లార్డ్స్) 1888
-By ముత్తోజు సత్యనారాయణ, Sr. Journalist