
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nandita) దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. కనీసం ఎమ్మెల్యే పదవిని చేపట్టి ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు.
లాస్య నందితను(Lasya Nandita) మృత్యువు వెంటాడిన వైనం
లాస్య నందితను మృత్యువు వెంటాడిన వైనం, విన్న ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది.
గత డిసెంబర్ లో లిప్ట్‌లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటి పడ్డారు.
ఈ మధ్య నల్గొండ BRS బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవ సారి ప్రమాదానికి గురయ్యారు. నల్గొండ (Nalgonda) ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఆటో ని ఢీ కొట్టింది. చిన్న గాయాలతో ఆమె బయట పడ్డారు.
ఇక మూడవ సారి ఓఆర్ఆర్ (ORR) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆవిడ మరణించారు. ఈరోజు తెల్లవారు ఝామున ఓఆర్ఆర్ వద్ద డివైడర్‌ను ఢీ కొని లాస్య కారు పల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే. ఆవిడ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో లోపల ఆర్గాన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు చెబుతున్నారు. లాస్య మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)కి తరలించారు.
ఇక కూతురి మరణ వార్త విని లాస్య తల్లి స్పృహ కోల్పోయారు. ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
అన్ని గండాలు తప్పించిన భగవంతుడు ఈ సారి గండం కూడా గట్టెక్కించి ఉంటే బాగుండేదని అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణాంతరం.. కుమార్తె నందితకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. నందిత ఇవాళ దుర్మరణం చెందడంతో అభిమానులు, అనుచరులు.. నియోజకవర్గ కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. గత ఫిబ్రవరిలో తండ్రి.. ఈ ఫిబ్రవరిలో కుమార్తె మరణం ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.