Mega Master Policy-2050: పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్- 2050, CM Revanth Reddy

Share the news
Mega Master Policy-2050: పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్- 2050, CM Revanth Reddy

పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్-2050

మాది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం

హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి

కొత్తగా ఫార్మా విలేజీలు

అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సహం

సీఐఐ(CII) ప్రతినిధులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

Mega Master Policy-2050

Mega Master Policy-2050: తెలంగాణ అంతటా 2050 నాటికి పారిశ్రామిక వృద్ధి (Industrial Development) జరగాలనే భవిష్యత్తు లక్ష్యంతో Mega Master Policy రూపకల్పన చేస్తామనిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సెక్రెటేరియట్లో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే.. 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు(Next level development) చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

పరిశ్రమల అభివృద్ధికి.. పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండీ పాలసీని అనుసరిస్తుందన్నారు సీఎం. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో అపోహలు, అనుమానాలకు తావు లేదని అన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని, అంతకంతకు విలువ కూడా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనే ఆలోచనలకు భిన్నంగా కొత్త పాలసీని తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా.. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరించాలనేది తమ లక్ష్యమని అన్నారు. నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి ఫలాలు, పెట్టుబడులతోనే గ్రామాలు, గ్రామీణ ప్రాంతాల సౌభాగ్యం, సంక్షేమం కూడా ముడిపడి ఉంటుందని అన్నారు. పారిశ్రామికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందేలా ఫ్రెండ్లీ పాలసీని అమలు చేసేందుకు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

See also  TS EAPCET 2024: టీఎస్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్స్ ల్లోకి ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల!

Mega Master Policy-2050: మూడు క్లస్టర్లుగా తెలంగాణ

ఈ పాలసీలో భాగంగా తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో ఉన్న ప్రాంతం సెమీ అర్బన్ క్లస్టర్ గా, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజీలను డెవెలప్ చేస్తామన్నారు. ORR పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని.. వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా కాలుష్యం లేకుండా, పరిశ్రమలతో పాటు స్కూల్స్, హాస్పిటల్స్, అన్ని మౌలిక సదుపాయాలుండేలా వీటిని డెవెలప్ చేసే ప్రణాళికలను తమ ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు.

See also  సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌(Commissioner)గా శ్రీ ఎం హనుమంత రావు

తెలంగాణలో ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా అక్కడ పరిశ్రమల ఏర్పాటు జరగాలని అన్నారు. రక్షణ రంగం, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్ లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.

ఎన్నికలు, రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దార్శనికతతో పారదర్శకమైన అభివృద్ధి తమ లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల వృద్ధికి సహకరించదని, అపోహాలు అవసరం లేదని, ఎవరికి వారుగా తమకున్న అభిప్రాయాలు ఇతరులపై రుద్దవద్దని హితవు పలికారు. 24 గంటల పాటు తాను ఆఫీసు లేదా క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటానని, తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారు. తమతోనూ, ప్రభుత్వ ప్రతినిధులు అయిన అధికారులతో మాట్లాడకుండానే తొందరపడి ఒక అభిప్రాయానికో, నిర్ణయానికో రావద్దని అన్నారు.

See also  New High Court in Telangana: 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, గత ప్రభుత్వం తరహాలో వీరిని తాము భారంగా భావించటం లేదని అన్నారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని తెలిపారు. యువతీ యువకులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునే సామర్థ్యం వాళ్ల సొంతమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఐటి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, సిఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు సి. శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, డాక్టర్ మోహన్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీమతి సుచిత్రా కె ఎల్లా, శ్రీమతి వనిత దాట్ల, రాజు, సంజయ్ సింగ్, ప్రదీప్ ధోబాలే, శక్తి సాగర్, వై హరీష్ చంద్ర ప్రసాద్, గౌతమ్ రెడ్డి, వంశీకృష్ణ గడ్డం, శివప్రసాద్ రెడ్డి రాచమల్లు, రామ్, చక్రవర్తి, షైక్ షామి ఉద్దీన్, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

-By రాంబాబు.C

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top