PM Modi initiated projects in Telangana
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సర్కార్ అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు పీఎం మోదీ (PM Modi)ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ “రాష్ట్రాభివృద్ధికి , తెలంగాణ ప్రభుత్వం కు, సీఎం రేవంత్ రెడ్డి కి సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. తెలంగాణలో గడిచిన పదేళ్లలో వేల కోట్లకుపైగా పనులు ప్రారంభించామన్నారు. ఎన్‌టీపీసీ రెండో యూనిట్ ప్రారంభించామని చెప్పారు. దీంతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు”.
ఇక అంతకుముందు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ “కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని రాకను 4 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారు”. ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ 1600 మెగావాట్లకు పరిమితిమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలని కోరారు. హైదరాబాద్ మెట్రోకు, మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో PM Modi తో పాటు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, గవర్నర్ శ్రీ తమిళి సై, ఎంపీ శ్రీ సోయం బాపు రావు, ఎమ్మెల్యే శ్రీ పాయం శంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి,తదితరులు పాల్గొన్నారు.
-By C. Rambabu